Tuesday 29 January 2013

ఇదేమిటి?

Monday 21 January 2013

మా నెల్లూరు'' టౌన్ హాల్ ''

ఇది మా నెల్లూరు పుర మందిరము అంటె ''టౌన్ హాల్''.ఇది నెల్లూరు లో ట్రంక్ రోడ్ 
మీద ఉంది.దీని పేరు  రావ్ బహద్దూర్ ''రేబాల లక్ష్మి నరసారెడ్డి పుర మందిరం''
ఇక్కడ చక్కాగా  సాహిత్య కార్యక్రమాలు అన్నీ జరుగుతాయి.ఈ వేదిక మీద 
జరిగే కార్యక్రమాలలో పాల్గొనడం ,బహుమతులు,అవార్డ్ లు అందుకోవడం 
ఎవరికైనా మర్చిపోలేని జ్ఞాపకం.నేను కూడా ఇక్కడ కొన్ని బహుమతులు 
 అందుకొని ఉన్నాను.

మధ్యలో కొన్ని మార్పులు చేసినా ఇది బ్రిటీష్ వారు ఉన్నప్పటి కట్టడం,
అసలు ఒక్కో గోడ మందం ఒక మీటర్ కు కొంచెం తక్కువ అంటె ఊహించుకోండి 
యెంత బలంగా ఉంటుందో.ఏమిటి లోపల చూస్తారా....సుస్వాగతం :))

ఇదిగోండి లోపల ఇలాగ ఉంటుంది.పైన పెంకులే ...అయినా చక్కగా ఉన్నాయి గమనించారా?
కుర్చీల వెనుక వాయిద్యాల బొమ్మలు గమనించండి 
ఇదిగో ఇదే ప్రధాన వేదిక.ఈ రోజు ఎందుకు వెళ్లావు అంటారా?ఈ రోజు కాదులెండి 
ఆదివారం అంటె ఇరవయ్యో తేది ఇక్కడ మా ''నెరసం''వారు జాతీయ స్థాయి కవి సమ్మేళనం 
నిర్వహించారు.నేను అందులో కార్యనిర్వాహక సభ్యురాలిని కాబట్టి వెళ్లాను.
కవి సమ్మేళనం చక్కగా జరిగింది.
ముందుగా ''గురు కృప''విద్యార్ధినులు వినాయకుని పై చేసిన నృత్యం అందరిని అలరించింది.
తరువాత కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ హైకోర్ట్ జస్టీస్ ''ఎల్.నరసింహం''గారు ,రచయితలు 
''సోమిరెడ్డి.జయ ప్రద''గారు,''కొండ్రెడ్డి.వెంకటేశ్వర రావు''గారు,ఇంకా మా అధ్యక్షులు 
జయ ప్రకాష్ గారు,సెక్రటరీ పాతూరి .అన్నపూర్ణ గారు ,కోశాదికారి మాటేటి.రత్నప్రసాద్ 
గారు జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం చేసారు(ఫోటో ఏది అంటె....మగ వాళ్ళు అందరు 
అడ్డం నిలుచుకున్నారు.తియ్యలేదు)
తరువాత మాకు అందిన ఆరువందల కవితలలో మొదటి మూడు స్తానాల్లో వచ్చిన వారికి 
బహుమతి ప్రధానం జరిగింది.తరువాత కవి సమ్మేళనం లో అన్ని ప్రదేశాల నుండి వచ్చిన 
కవులతో ఎనిమిది ఆవ్రుతాలు జరిపి ఒక్కో ఆవ్రుతానికి ప్రైజ్ లు ఇవ్వడం జరిగినది.
ముగింపు సభలో కాకాణి.గోవర్ధన్ రెడ్డి గారు,ఎం.ఎల్.ఏ.ముంగమూరి .శ్రీధర్ కుమార్ రెడ్డి గారు 
ప్రముఖ కవి ''రస రాజు''గారు పాల్గొన్నారు.
''రస రాజు ''గారిని వేదిక మీదకు ఆహ్వానిస్తూ .......

వచ్చే నెలలో ''సోమిరెడ్డి.జయ ప్రద''గారి మీద హైదరాబాద్ లో సెమినార్ జరిగే సందర్భంగా 
ఆమెను సన్మానించాము.తరువాత ఎలాగు మాకూ ప్రశంస లు ఉంటాయి.ఇలాగ కార్యక్రమం 
బాగా జరిగింది.
ఇక్కడ రెండు మాటలు.....రస రాజుగారు మాట్లాడుతూ ఒక గజల్ గుర్తు చేసారు.
గజల్ కి సాహిత్యము మరియు గాత్రం చాలా ప్రధానం అని నాకు అనిపిస్తూ ఉంటుంది.
ఎందుకంటె ఈ గజల్ నేను ఒక సభలో ''గజల్ శ్రీనివాస్''పాడితే విన్నాను.ప్రతీ వాక్యానికి 
చప్పట్లు మ్రోగిపోయాయి.ఇక్కడ కూడా అలరించింది.గాత్రం సరిపోలేదు.మీరు వినే ఉంటారు.

''తిన్నావా లేదా అని అన్నానా ఎపుడైనా 
నడుం వాల్చావా లేదా అని అన్నానా ఎపుడైనా  ......

చీర నీకు బాగుందని అన్నానే కాని 
ఆ చీరకు నువ్వే సొగసని అన్నానా ఎపుడైనా ......
తిన్నావా లేదా అని అన్నానా ఎపుడైనా......

నీ జడలో పూల పరిమళాలు పీల్చానే కాని 
నీ మనసులోని పరిమళాలు పీల్చానా ఎపుడైనా....
తిన్నావా లేదా అని అన్నానా ఎపుడైనా....

ఇలా భార్యను పొగుడుతూ సాగుతుంది....నాటకీయత 
కావొచ్చు కాని ఒకరిని ఒకరు ప్రశంసించు కోవడం 
వారి మధ్య అనుబంధాన్ని గట్టిగా చేస్తుంది.

పోనీలే అని ఈయనకు వినిపిస్తే అంటారు 
''అదేమిటి అయ్యన్నీ చేసినది ఆయనే కదా....మళ్ళా భార్యను చేసానా?
అని అడుగుతాడు.....ఆయనకు ఏమైనా తిక్కా?అంటారు.

నిజమే సుమా ...సాహిత్యపు వెల్లువలో గమనించలేదు కాని....
ఆయన అన్నది నిజమే........



Monday 14 January 2013

మా శివాలయం లో గోదా దేవి రంగనాయకుల కళ్యాణం

''మాంగల్యం తంతునానేనా లోక జీవన హేతువా''
భగవంతుని కళ్యాణం లోకానికి మంచి జరగాలి అని.
మరి పండుగ రోజు అందరు పనులు మానుకొని ఇలా కలిసి మెలిసి 
కళ్యాణం లో పాల్గొనడం ఊరు అంతటికి సంతోషమే కదా....లేకుంటే 
అందరు టి.వి. లకు అతుక్కొని పోయి ఎవరికి వారే యమునా తీరే.

మా శివాలయం ఆవరణలో కృష్ణ మందిరం,శివాలయం,వాసవి కన్యకా పరమేశ్వరి గుడి,
కళ్యాణ మండపం,రామాలయం,పక్కన షిర్డీ సాయిబాబా గుడి ఉంటాయి.
అంటే  ప్రతి రోజు అక్కడ ఏదో ఒక సందడి ,పూజలు.

ఇదిగోనండి.....పెళ్లి కూతురు,పెళ్లి కొడుకు అదే....గోదాదేవి,రంగనాధులు కళ్యాణ మండపానికి
బయలుదేరారు.

మేము అబ్బాయి తరుపున పెళ్లి పీటల మీద కూర్చున్నాము.అందుకు ఆయనను తీసుకొని బయలుదేరాము.
వెనుక కృష్ణుని పాల రాతి విగ్రహం చూసారా?చాలా బాగుంటుంది.
మధ్యలో ఎదురుకోలు జరిగే ముందు విడిది.కోలాట సేవ.చిన్న పిల్లల నుండి పెద్ద వాళ్ళ దాకా
అందరు కోలాటం వేస్తారు.స్వామీ వారికి సేవగా.....


కళ్యాణం వేదిక మీద జరుగుతూ ఉంది.కంకణ ధారణ,యజ్ఞోపవీత ధారణ,మాంగల్య పూజ,
కన్యా దానం,జిలకర బెల్లం,మాంగల్య ధారణ,తలంబ్రాలు .....ఎంతో వేడుకగా జరిగాయి...
ఏకాంత సేవ అనంతరం వివాహ భోజనాలు.....అంతకు ముందు భోగి పండుగ లేదు అంట.
గోదా దేవి స్వామీ వారికి భోగ్యం అయింది కాబట్టి భోగి పండుగ అంట.
ఇరుగో కొత్త పెళ్లి కూతురు,పెళ్లి కొడుకు .....అమ్మవారి కుచ్చులు చూసారా?పోయిన సారి
వసూలు అయిన డబ్బులుతో తయారు చేయించాము.

ఇదే మా శివాలయం.రేపటి నుండి  ''ఏటి పండుగ''అంటే అందరు స్వర్ణముఖీ నదీ తీరానికి
వెళతారు.అక్కడ ఇంకో శివాలయం  ఉంటుంది.కొందరు గొబ్బెమ్మలను నీళ్ళలో ఓలలాడిస్తారు.
పిల్లలు గాలి పటాలు,రంగుల రాట్నాలు.కొన్ని పోటీలు కూడా  జరుగుతాయి.ఇసకేస్తే రాలని
జనాలు అంటారు కదా అలాగా ఉంటుంది.




మా వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు.పాలరాయి విగ్రహం బాగుంది కదా....


Thursday 3 January 2013

తెలుగు సభలు ౨

Wednesday 2 January 2013

ప్రపంచ తెలుగు మహా సభలు ౨౦౧౨

చెప్పాను కదా తిరుపతి లో తెలుగు సభలకు మొదటి రోజు వెళ్లాను అని.
ఆ ఫోటోలే ఇవి.
మరి తెలుగు రచనా వ్యాసంగం లోనే కాక ,కొత్త బ్లాగ్ విషయం లో సహాయం 
చేసిన వలభోజు.జ్యోతి అక్కకు పోస్ట్ అంకితం.
స్వాతి శంకర్ గారు వేదిక అదుర్స్  అంటే  మీరు ''థాంక్యు''ఎందుకు చెప్పారు?
చెప్పండి ప్లీజ్ 

అదిగో సైకత శిల్పం,పక్కనే కళాకారుడి మొబైల్ నంబర్ 
ఎవరైనా చెయ్యాలి అనుకుంటే చెయ్యండి.


అబ్బా యునివర్సిటీ లో లోపలకు దాదాపు ఒకటిన్నర కిలో మీటర్ లు నడుస్తూ ఉంటె ఇదిగో ఇలాటి వాళ్ళు,
పండరి బజనలు,తప్పెట్లు,నెమలి,పులి వేషగాళ్ళు,ముందు వచ్చే జనాలను చూస్తూ ఆ రష్ లో
వీళ్ళని చూడాలని ...భలే తిక మక పడిపోయాను

ఇదిగోండి ఇదే ప్రధాన వేదిక.పెద్ద తామర పువ్వు ఉంటుంది.మధ్యలో ఈ స్టేజ్ ఉంటుంది.
చూసారు కదా పైన మామిడి ఆకుల తోరణం.చిత్రం ఏమిటంటే దానిలో ఏబైఆరు అక్షరాలు
ఇలు,ఇలూ,ఋ,బండి ర....ఇలా ఒక్కటి కూడా వదలకుండా వేసారు.అలా చూస్తుంటే నాకు
ఎంత సంతోషం వేసిందో.అటు,ఇటు రామప్ప శిల్పాలు వేసి ఉన్నాయి.

కవి సమ్మేళనం లో ''కొప్పర్తి''వారు చెప్పిన కవిత గుర్తుకు వస్తూ ఉంది.
''ఒక్క అక్షరం రాలి పోయినా భాషకు చిల్లు పడ్డట్లే
శబ్దమే ప్రధానం అయిన భాష కదా మనది
ప్రతి అక్షరము దాని ప్రత్యేక  శబ్దము కలదే
జీవ వైవిధ్యం అని చిన్న ప్రాణులను కాపాడుకుంటామే
అక్షరాలను ఎందుకు కాపాడుకోవడం లేదు
అక్షరాలను రాల్చగలవు కాని
ఒక్క అక్షరాన్ని అయినా సృజించగలవా"
వహ్వ....ఏమి చెప్పారో....అసలు  అందరం ఒక్కో మాటకి ఉలిక్కిపడ్డాము.

ఇంకా తిరుపతి కొండ,ముందు స్వర్ణముఖీ నది,పుస్తకం ,ప్రక్కన నాట్యా చార్యులు
....ఎందుకు లెండి.రెండు కళ్ళు చాలలేదు.ఇంకా వేదిక మీద తెలుగు తల్లి విగ్రహం ఉంది.
ఈ సారి పోస్ట్ లో వేస్తాను



Tuesday 1 January 2013

కొంచెం ముక్కు మూసుకోండి

ఏమిటి ఇది అందమా అంటారా?భలే వాళ్ళే ఇది మీరు
NH.5 నుండి నాయుడుపేటకు వచ్చే దారిలో ఉన్న
మా ఊరి ''డంప్ యార్డ్''....''చెత్త స్తలం''....
మరేమో ఇప్పుడే ముక్కు మూసుకుంటూ ఉన్నారే ...
అది మా స్తలం మీరు వాడ కూడదు అని రైల్వే వాళ్ళు,
మాకు డంప్ యార్డ్ లేదు అదే వాడుతాము అని మా
పంచాయతీ వాళ్ళు గొడవలు పెట్టుకొని ....బాగు చేసే వాళ్ళు
లేక అలా అయిపోయంది.
అసలు నేను స్కూల్  కి అదే దారిలో వెళ్ళాలి ,చేతులు స్కూటీ
నుండి తియ్యలేక ,ముక్కు మూసుకోలేక నరక యాతన.

ఏదో తెలుగు సభలు జరిగిన అదృష్టం........
మహా మహులు ఆ దారిలో వెళ్ళిన అదృష్టం.....
కొంచెం సున్నం చల్లి ఇదిగో ఈ మాత్రం  ఉంది.

ఇక్కడేదో చాలా మంది శాస్త్రవేత్తలు ఉన్నారు.కొంచెం ఆ
మీథేన్ ని గ్యాస్ గా మార్చే మార్గం చెప్పండి :)




ఇంకా ఫోటోలు తీద్దాము అనుకున్నాను కాని....అప్పటికే అక్కడ వెళ్ళే జనాలు
ఈ మేడం పందులకు ఎందుకు ఫోటోలు తీస్తుంది అని అర్ధం కాక ...జుట్టు పీక్కుంటున్నారు.
అందుకు ఆపేసి వచ్చేసాను :)



మా తోటలో పూలు

సుస్వాగతం ....దీపాలతో